మునుగోడు ఉప ఎన్నిక ప్రచారాల జోరుగా సాగుతున్నాయి. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ.. హామీల హోరెత్తిస్తున్నారు నాయకులు. అయితే ఈ నేపథ్యంలోనే.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ నాలుగేండ్ల పాటు నియోజకవర్గాన్ని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఒక్కో ఓటును డబ్బు పెట్టి కొట్టాను అంటున్నాడు. ఇది ప్రజలపై బలవంతంగా రుద్దిన ఎన్నిక అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ మాకు మోదీ ఇచ్చిండని ఆయనే చెబుతాడు.
మళ్లీ మాది చిన్న కంపెనీ అని అంటడు. మరి చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన వారెవరు? దాని వెనుక ఉన్నది ఎవరు? మునుగోడుకు అవసరం లేని ఎన్నిక ఇది. బలవంతంగా మీ మీద రుద్దబడుతున్న ఎన్నిక ఇది అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. మిషన్ భగీరథకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలంటే మోదీ ఇవ్వరు. కానీ రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టులను అప్పనంగా రాజగోపాల్ రెడ్డికి కట్టబెట్టారు. ఓ కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.