కేసీఆర్ అంటే సంక్షేమం, విపక్షాలది సంక్షోభం అని కామెంట్స్ చేశారు మంత్రి కేటీఆర్. 60 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయని వాళ్లు ఇప్పుడు చేస్తారా..? అని ప్రశ్నించారు. ఒక్కఛాన్స్ ఇవ్వండని మీ దగ్గరకు వస్తారు.. వారిని నమ్మి మోసపోకండి అని పిలుపునిచ్చారు. పొలిటికల్ టూరిస్టులు చెప్పే మాటలను ఎవరూ నమ్మొద్దన్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరే అని అన్నారు. త్వరలోనే కేసీఆర్ నోట శుభవార్త వింటారని చెప్పారు. తాము ఎవరికీ బీ టీమ్ కాదన్నారు. తమది తెలంగాణలో ఏ టీమ్ అన్నారు.
విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టాలంటే.. చారిత్రక కార్యక్రమాలు చేయాలంటే నాయకులకు తెగువ, తెగింపు ఉండాలని.. అల్లాటప్ప నాయకులతో విప్లవాత్మక పథకాలు రావని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం అనంతరం 76 ఏండ్లలో ఎవరూ పెట్టని విధంగా కేసీఆర్ నాయకత్వంలో దళితబంధు అనే విప్లవాత్మక పథకాన్ని పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1100 మందికి దళిత బంధు అందుతున్నదని తెలిపారు. బాబా సాహెబ్ ఆశయాలను ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్లున్నారని అన్నారు. కుల రహిత సమాజం, వివక్ష లేని సమాజం ఉండాలంటే ఆర్థిక అసమానతలు తొలగిపోవాలనే ఆకాంక్షతో సీఎం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో ఆలోచన చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.