వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ దిక్సూచిగా మారిందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి ఉద్ఘాటించారు. సాగునీటి రాకతో గ్రామాలకు వలసలు పెరిగాయన్నారు. ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాల బాటపట్టారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ జీవనవిధానం మారుతూ వస్తున్నది అని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. గ్రామాలలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పట్టణాలపై ఒత్తిడి తగ్గుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణాలకు ధీటుగా పల్లెల్లో ప్రజలకు అన్ని వసతులు ఉండాలన్నది ప్రభుత్వ ఆలోచన అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారుల నిర్మాణం, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాల నిర్మాణం, పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ మాదిరిగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా ఎక్కడా రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, కళ్యాణలక్ష్మి, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్, అమ్మఒడి, గురుకుల పాఠశాలలు, సన్నబియ్యం అన్నం, ఆసరా ఫించన్ వంటి పథకాలు అమలుకావడం లేదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, దార్శనికతకు తెలంగాణ నిదర్శనం అని నిరంజన్ రెడ్డి తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.