తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం నాగవరం తండా వద్ద బీఆర్‌ఎస్ జెండాను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందుతున్నాయని పేర్కొన్నారు.
సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్రం ఆనవాలుగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతు బీమా, సాగునీరు, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ తదితర ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాలలో భాగంగా రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు దినోత్సవం సందర్భంగా సాయంత్రం జరిగిన రాష్ట్ర స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.