ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళు దగ్గర వైసీపీ-టీడీపీ క్యాడర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చిన్నగా మొదలైన ఘర్షణ వాతావరణం చివరకు పెద్దదైపోయింది. దాదాపు మూడు గంటలపాటు రెండు పార్టీల నేతలు, శ్రేణులు ఒకళ్ళపై మరొకళ్ళు రాళ్ళతో దాడులు చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. అడ్డొచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 14 మంది పోలీసులకు తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. అలాగే రెండు పార్టీల్లోని వాళ్ళకి కూడా గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశ నుంచే తనతో చంద్రబాబుకు గొడవ ఉందని ఆయన చెప్పారు. అందుకే పుంగనూరులో టీడీపీ నేతలను, కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారని అన్నారు. పుంగనూరు ఘటనకు చంద్రబాబే కారణమని చెప్పారు. మతిభ్రమించి ఆయన నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. బైపాస్ రోడ్ లో వెళ్తానని రోడ్ మ్యాప్ ఇచ్చి పుంగనూరు పట్టణంలోకి వచ్చారని దుయ్యబట్టారు. తన కాన్వాయ్ లో రౌడీమూకలను, కర్రలను, రాళ్లను తెచ్చారని చెప్పారు. పోలీసులపై దాడి చేసిందేకాక, రివర్స్ లో మాట్లాడుతున్నారని అన్నారు. ఓటమి భయంతో హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.