మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం వాడివేడిగా సాగుతోంది. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు నేతలు. అయితే.. మునుగోడు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిస్తే ఏడాదిలో అభివృద్ధి చేస్తానని బీరాలు పలుకుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గెలిచిన తరువాత నియోజకవర్గం ముఖం చూడని రాజగోపాల్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి తలసాని తెలిపారు. వ్యక్తిగత స్వార్థం కోసం ఎన్నికలు తీసుకొచ్చిన ఆయనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తలసాని వెల్లడించారు.
కాంట్రాక్టులపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై కనీస అవగాహన లేదని మంత్రి తలసాని మండిపడ్డారు. గెలిస్తే మునుగోడుకు వెయ్యి కోట్లు తీసుకొస్తానని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ అభ్యర్థి దుబ్బాక, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకురాలేకపోయారని విమర్శించారు మంత్రి తలసాని. బీజేపీ నాయకులు ఏక వచనం తో మాట్లాడడం శోచనీయమని తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతుందని అందుకు బీజేపి కార్పొరేటర్ వద్ద కోటి రూపాయలు దొరకడం ఒక నిదర్శనమని తలసాని ఆరోపించారు. మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేసిన ఘనత కేసిఆర్‌దేనని మంత్రి పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమాను వ్యక్తం చేశారు మంత్రి తలసాని.