తెలంగాణలో పాత సచివాలయం భవనాన్ని కూల్చడాన్ని విపక్షాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఏ కార్యక్రమమైనా ఆపిందా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తే సహించబోమన్నారు. పార్లమెంట్ కు నూతన భవనాన్ని నిర్మించడంలేదా, ఆ భవనానికి ఏమైందని ప్రశ్నించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే ఉరుకోబోమన్నారు.
అయినా సచివాలయం అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశమని.. దాన్ని కడితే వచ్చే ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు సెక్షన్-8 ఆలోచన రావడం దుర్మార్గమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులది బానిస మనస్తత్వమని, బానిస బతుకులు బతికారని, బీ ఫాం, మంత్రి పదవుల కోసం ఆంధ్ర నాయకత్వం మోచేతి నీళ్లు తాగారని ధ్వజమెత్తారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు, లోపల పడేస్తాం అంటూ హెచ్చరించారు.