దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయన సతీమణి విజయమ్మ ‘‘నాలో… నాతో… వైయస్సార్’’ అనే పుస్తకాన్ని రాసారు. ఈ పుస్తకాన్ని వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో బుధవారం ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. వైఎస్సార్ జీవితంలో పెనవేసుకున్న బంధాలను, ఆయన మరణం తర్వాత జరిగిన రాజకీయ, కుటుంబ పరిణామాలను ఆమె ఇందులో వివరించారు.
డాక్టర్ వైయస్సార్ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా… నిజ జీవితంలో వైయస్సార్‌గారు ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు. అలాగే వైఎస్ చిన్నవయసులో పెళ్లి, పేదల డాక్టర్‌గా పేరు, రాజకీయ ప్రవేశం, నాయకత్వ లక్షణాలు, దైవచింతన.. మరెన్నో అంశాలను ఆమె వివరించారు. ప్రజాసంక్షేమం కోసం ఆయన శ్రమించిన తీరును ప్రస్తావించారు.