కేసీఆర్‌ కాళ్లు మొక్కుతానన్న మంత్రి..?

-

బీజేపీ నాయకులు చిన్న పెద్ద వయస్సు తేడా లేకుండా తండ్రి వయసున్న సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ వీరిద్దరూ హద్దులు దాటి మాట్లాడరాదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక సంజయ్, అర్వింద్‌ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడారు.

రాజీనామాకు సిద్ధమా..?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న రూ. 2016 పెన్షన్‌లో, కేంద్రంలో ఉన్న బీజేపీ రూ. 200లకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వడం లేదని «ధ్వజమెత్తారు. ఒకవేళ తమ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. నిరూపించకుంటే ఎంపీ పదవికి అర్వింద్‌ రాజీనామా చేస్తారా ప్రశ్నించారు.

తండ్రి వయసు కాబట్టి..

తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి పథకంలో కేంద్ర ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదన్నారు. గృహ నిర్మాణాల కోసం తెలంగాణ ప్రభుత్వం 4.32 లక్షలు ఇస్తుంటే.. కేంద్రం కేవలం రూ. 72 వేలు మాత్రమే ఇస్తుందని ఆరోపించారు. బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలపై ప్రేమ, పౌరుషం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించి, కేంద్రం నుంచి నిధులు తెప్పించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కన్న కొడుకులాగా చూసుకుంటారు కాబట్టే తండ్రి సమానమైన కేసీఆర్‌ కాళ్లు ఒక్కసారి కాదు.. ఎన్నిసారైనా బరాబర్‌ మొక్కుతానని మంత్రి అన్నారు.

ప్రజల క్షేమం కోరుకునే వారైతే..

రాజకీయ నాయకులంటే ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడాలే కానీ.. సంస్కార హీనులుగా మాట్లావద్దని ఎంపీ అర్వింద్, బండి సంజయ్‌లకు సవాల్‌ చేశారు. ప్రజల క్షేమం కోరుకునే వారైతే సీఎంఆర్‌ఎఫ్‌ లాగా, పీఎం ఆర్‌ఎఫ్‌ కూడా ఉంటుందని అందులోంచి ఆస్పత్రులకు అయ్యే ఖర్చులను భరించేలా చర్యలు తీసుకోవాని మంత్రి డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version