కరోనా సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ప్రపంచ దేశాలకు టీకా అందిచాలని ప్రయత్నించిన చైనాకు చుక్కెదురైంది. సకాలంలో టీకా అందించకపోవడం.. మరోవైపు టీకాపై పూర్తి స్థాయిలో విచారణ జరపకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంది. కానీ ఇండియా టీకా పంపిణీ విషయంలో దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. పొరుగు దేశాలను బుట్టలో వేసుకోవాలన్న చైనా ఆశలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
మయన్మార్ ప్రభుత్వం అసంతృప్తి..
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ జనవరి 11వ తేదీన మయన్మార్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన మూడు లక్షల కోవిడ్ టీకాలను పంపిణీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, ఇప్పటివరకూ టీకా పంపిణీ జరగలేదు. దీంతో మయన్మార్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనా టీకా పంపిణీ చేస్తుందనే నమ్మకంతో వేరే దేశాల టీకాలను సైతం కాదనుకుంది. దీంతో ప్రస్తుతం మయన్మార్ కు మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం మయన్మార్ దేశానికి అండగా నిలిచింది. ఏకంగా 15 లక్షల డోసుల టీకాను అందించింది. దీంతో ఆ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరణ..
చైనాకు చెందిన సైనోవాక్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. దీనికి కారణం చైనా ప్రభుత్వం టీకా ట్రయల్స్ కోసం ఖర్చు భరించమని చెప్పడమే. దీంతో బంగ్లాదేశ్ కూడా టీకా పంపిణీపై చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ మేరకు బంగ్లాదేశ్ కు చెందిన బెక్సిమో ఫార్మా.. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా కుదర్చుకుంది.
దూసుకెళ్తున్న భారత్..
వ్యాక్సిన్ పంపిణీలో భారత్ దూసుకెళ్తోంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులకు ఉచితంగా 32 లక్షల టీకా డోసులను పంపిణీ చేసింది. ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్ తో ఏర్పడిన పొరపొచ్చాలను సరిదిద్దుకోవడానికి టీకా దౌత్యాన్ని ఉపయోగించనుంది. ఆఫ్రికా దేశాలకు కోటి డోసులు, ఐరాసకు 10 డోసులు పంపించేందుకు సుముఖత చూపింది. ఇలా మొత్తం 92 దేశాలు భారత్ టీకాపై ఆసక్తి చూపిస్తున్నాయి.