వైద్య విద్యార్థిని చదువుకు మంత్రుల సాయం..కేటీఆర్ ట్వీట్

-

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కొమ్ము సింధూరకు వైద్య కళాశాలలో సీటు వచ్చినా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోందని ప్రచురితమైన కథనాన్ని ఓ నెటిజన్, కల్వకుర్తి జడ్పిటిసి భరత్ మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేయగా ఆయన స్పందించారు. ట్విట్టర్ లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి కేటీఆర్ ఈ విషయంపై తక్షణమే స్పందించారు. కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఆమెకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. మరికొంత మంది అన్ లైన్లో నగదు పంపిస్తూ తమకు చేతనైనంత సాయం చేస్తున్నారు.మంత్రి కేటీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శి సింధూర మేనమామతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అలాగే మరో మంత్రి హరీష్ రావు ఆదేశాలతో అధికారులు సింధూర వ్యక్తిగత ఆర్థిక వివరాలను సేకరించారు. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ స్వయంగా తనతో మాట్లాడి అండగా ఉంటామని వైద్యవిద్యను కొనసాగించాలని సూచించినట్లు తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని పలువురు వైద్యులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రవాస భారతీయులు సింధూర వివరాలు తెలుసుకున్నారు. గురువారం రాత్రి 8 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా పదిమంది 49 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారని కుటుంబసభ్యులు తెలిపారు.సింధూర తండ్రి వెంకటయ్య ఓ కంపెనీలో వాచ్ మెన్, తల్లి అలివేలు కార్మికురాలు..తమ్ముడు దివ్యాంగుడు. ఇంటి నిండా ఆర్థిక సమస్యలున్న సింధూర కు చదువు పై ఉన్న శ్రద్ధను గుర్తించిన తల్లిదండ్రులు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. కానీ వైద్య రంగంలో సీటు వచ్చినా పేదరికం కారణంగా ఇబ్బందులు పడుతున్న ఓ విద్యార్థిని కి రాష్ట్ర మంత్రులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version