జగన్‌కీ వీళ్ళకీ మధ్య ఎక్కడ మిస్ అండర్ స్టాండింగ్ వచ్చింది… ?

-

అమరావతిలోనే రాజ‌ధానిని కొన‌సాగించాల‌నే ఉద్య‌మం 200 రోజులకు చేరింది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజలు నిర్విరామంగా నిర‌స‌న దీక్ష‌ల్లో కూర్చూంటూనే ఉన్నారు. మా త్యాగాల‌ను వైసీపీ ప్ర‌భుత్వం అవ‌హేళ‌న చేస్తూ.. మా భ‌విష్య‌త్‌ను అంధ‌కారంలోకి నెడుతూ వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకుంద‌ని మండిప‌డుతున్నారు. ఏడు నెల‌లుగా ఈ ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే నినాదాన్ని వినిపిస్తూ రైతులు, మహిళలు, చిన్నారులు పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి నిద్రాహారాలు మాని దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో నిరసను తెలియజేస్తున్నారు.

ఇప్పుడు ఉద్య‌మం మ‌రింత ఉధృతమ‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని కీల‌క  నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు స‌మాచారం. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల్లో నిరసనలు తెలియజేయాలని నాయ‌క‌త్వం నిర్ణ‌యించింది.  వీరి ఉద్యమానికి నేడు రాజకీయ పార్టీలు కూడా సంఘీభావాన్ని ప్రకటించనున్నాయి. అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా శనివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేయనున్నారు. అమరావతి ఉద్యమంపై ఉదయం 11 గంటలకు వర్చువల్ మీటింగ్ జరుగనుంది.

పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ మీటింగ్‌లో పాల్గొంటారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటలకు అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. రాజధాని అమరావతికి అక్కడ 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా అప్పటి ప్రభుత్వానికి 30 వేల ఎకరాలు భూమిని ఇచ్చారు. అమరావతిలో రాజధాని నిర్మాణం జరుగుతుందని, తమ జీవితాలు బాగుపడతాయని ఆశించారు. మూడు పంటలు పండే భూములను సయితం వారు ప్రభుత్వానికి ఇచ్చేశారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలు లో న్యాయ రాజధాని నిర్మించాలని ఈ ఏడాది జనవరి నెలలో అసెంబ్లీలో జగన్ ప్రకటించిన విష‌యం తెలిసిందే.

రాజ‌ధాని త‌ర‌లింపును అంగీక‌రించ‌ని ప్ర‌జ‌లు మ‌రుస‌టి రోజు నుంచే  రైతులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. శాసనమండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో ఇప్పటి వరకూ రాజధాని తరలింపు నిలిచిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ రాజ‌ధాని రైతుల విష‌యంలో ఓ ప‌క్కా ప్లానింగ్‌తో వెళ్లి వారిని కూడా సంతృప్తి ప‌రిచి ఉంటే అక్క‌డ చిన్న అసంతృప్తులు కూడా లేకుండా ఉండేవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version