ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంతలో సరుకుల్లా అమ్మకానికి పెట్టడం దుర్మార్గం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి. నూతన కళాశాలలు వస్తే తమ ఎంబీబీఎస్ కల నెరవేతుందనుకున్న బడుగు, బలహీన వర్గాల ఆశను జగన్ చిదిమేశారంటూ మండిపడ్డారు. తాను పేదల పక్షం అని మాటలు చెప్పే జగన్.. ఆచరణలో మాత్రం పైసలు ఇచ్చిన వారికే మెడికల్ సీట్లు కట్టబెట్టడం పెత్తందారి ఆలోచన కాక మరేంటి అని ప్రశ్నించారు.
ప్రయివేటు మెడికల్ కళాశాలలో సైతం ఏ కేటగిరి సీట్లను రిజర్వేషన్ ప్రాపతిపదికన ఇస్తుంటే.. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వాటిని ఎత్తేసి పేదలకు జగన్ అన్యాయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. జగన్ ధన దాహానికి కొత్తగా వచ్చిన 750 ఎంబీబీఎస్ సీట్లలో 168 సీట్లను పేద విద్యార్థులు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే చైనా ఫిలిప్పిన్స్, ఉక్రెయిన్ వంటి దేశాలలో ఎంబీబీఎస్ చదవడం ఈజీ అన్నారు. పేదలు చదువుకుని బాగుపడితే చూడలేవా జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి. సీట్లను అమ్మకూడదని జూనియర్ డాక్టర్లు లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం కాదా అని నిలదీశారు. ఇప్పటికైనా సీట్ల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి డిమాండ్ చేసారు.