చంద్రగిరిలో పీఏల పెత్తనం చెవిరెడ్డికి మైనస్ గా మారిందిగా

-

సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా పెత్తనమంతా ఎమ్మెల్యేలదే. మండలస్థాయిలో స్థానిక నాయకులు హడావిడి చేస్తారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మాత్రం సీన్ వేరేగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే ఇచ్చిన అనధికార పదవులతో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చుక్కలు చూపిస్తున్నారట పీఏలు. వీరి హవాతో ఇదెక్కడి గొడవరా బాబు అని కేడర్‌ హడలిపోతోంది.

రెండోసారి చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచాక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. దీంతోపాటు తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగానూ కొనసాగుతున్నారు చెవిరెడ్డి. అయితే పనిభారం మనకెందుకులే అనుకున్నారో ఏమో నియోజకవర్గంలోని మండలానికి ఒక ఇంఛార్జ్‌గా పీఏలను నియమించుకున్నారట. ఇలా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో ప్రజలకు ఏ పని కావాలన్నా తనను కలిసే అవసరం లేకుండా పీఏలతో కానిచ్చేస్తున్నారట.

కేవలం ప్రజలే కాదు.. ఆయా మండలాలకు చెందిన వైసీపీ కేడర్‌ను సైతం పీఏలనే కలవాలని చెప్పారట ఎమ్మెల్యే చెవిరెడ్డి. పనులు సులభంగా అవుతాయని ఎమ్మెల్యే భావిస్తే.. క్షేత్రస్థాయిలో పీఏలు ఆ అవకాశాన్ని ఇంకోలా వాడుకుంటున్నారని చంద్రగిరి కోడై కూస్తోంది. సదరు పీఏలు బాగానే వెనకేసుకుంటున్నారట. పడమర మండలానికి చెందిన పీఏ ఇప్పటికే ఎమ్మెల్యే పేరును ఓ రేంజ్‌లో వాడేసుకున్నారని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇది తెలుసుకున్న ఇతర మండలాల పీఏలు తామెందుకు వెనకబడాలని కౌంటర్‌ తెరిచేశారట.

ఎక్కడా లేని విధంగా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రవేశపెట్టిన ఈ కొత్త సంప్రదాయంపై వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని సమాచారం. పీఏలకు ఇస్తోన్న ప్రాధాన్యం.. ఇన్నాళ్లూ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు లేదని వాపోతున్నారట. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల బదిలీలు, పట్టాల పంపిణీ, పింఛన్లు ఏవి కావాలన్నా.. పీఏలు ఆమోద ముద్ర వేయందే ఫైల్‌ కదిలే పరిస్థితి లేదట.

వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటోన్న తమను కాదని.. ప్రభుత్వ ఉద్యోగులను పీఏలుగా నియమించుకోవడంపై కేడర్‌ కుతకుతలాడుతోందట. కొంతమంది అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సాధారణంగా ప్రజా పనుల పరిష్కారంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి దూకుడుగా ఉంటారని చెబుతారు. కానీ ఇక్కడ పీఏలు మాత్రం అభివృద్ధిలో కాకుండా అవినీతిలో దూకుడు ప్రదర్శిస్తున్నారట. ఎవరిని కదిలించినా.. ఈ విషయం ఎమ్మెల్యే చెవిరెడ్డి చెవిలో పడిందో లేదో కానీ.. చెవిరెడ్డి కి మాత్రం నియోజకవర్గంలో బాగా మైనస్ అవుతుందనే టాక్ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version