కడప జిల్లా రాజకీయాల్లో ఆమెది చెరగని ముద్ర. కడప జిల్లా నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యే ఆవిడ. రాజకీయంగా ఎన్నో విజయాలు సాధించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కి దగ్గరి వ్యక్తి ఆమె. తన రాజకీయ జీవితంలో దాదాపు ఆరుగురు ముఖ్యమంత్రులను చూసారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సలహాలు ఇచ్చిన ఘనత ఆమెది. ఇప్పుడు 80 ఏళ్ళ వయసులో కూడా రాజకీయం చేస్తున్నారు.
చురుకుగా ఉంటూ అందరికి ఆదర్శంగా ఉంటున్నారు. ఆమె ఎవరో కాదు ప్రభావతమ్మ. 1978, 1983, 2004 ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. 1972 నుంచి నేటివరకు జిల్లా రాజకీయాల్లో ఆమెకు ప్రత్యే క గుర్తింపు ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండుమార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన తరువాత కూడా తమ గ్రామం పెనగలూరు మండలం కొండూరు సర్పంచ్ గా పని చేసారు.
1995-2000 మధ్యకాలంలో ఆమె కొండూరు సర్పంచ్‌గా సేవలు అందించారు. సాధారణంగా సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అవుతారు. కాని ఆమె మాత్రం ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగి, పదవులు అనుభవించిన తర్వాత కూడా సర్పంచ్ గా పోటీ చేయడం నిజంగా ఆదర్శమే. రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు మనకు చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. అందులో ఈమె కూడా ఒకరు. కాగా ఏపీ లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.