సకల జనులు సమరం చేస్తే తెలంగాణ వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జల్, జంగల్, జమీన్ అంటూ కుమురం భీం పోరాడారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగించిన సమరం తెలంగాణ ఉద్యమమని.. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందని పరిస్థితి నెలకొందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అందరికీ అందాయా అన్నదే ప్రశ్న అంటూ పవన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగించారు. నాలాంటి కోట్ల మంది కన్నకలలకు ప్రతిరూపమే నరేంద్ర మోడీ అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మూడు దశాబ్దాల ప్రగతిని మోదీ ఒకే దశాబ్దంలో సాధించారని.. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడం కష్టమన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని కావాలని ఆకాంక్షించారు.
2004-14 వరకు ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ మోదీ వచ్చినప్పటి నుంచి వాటిని కంట్రోల్ చేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. 30 ఏండ్లల్లో లేని అభివృద్ధి.. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన 10 ఏండ్లలో జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడమే కాదు.. ప్రతీ భారతీయుడి గుండెలో మోదీ ధైర్యం నింపారని కొనియాడారు. ‘మోదీ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకుంటే ట్రిపుల్ తలాక్ రద్దు చేసే వారు కాదు.. ఆర్టికల్ 370 రద్దు చేసేవారు కాదు. ఆయన అద్భుతమైన విజనరీ లీడర్. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. ప్రపంచం మొత్తం మనల్ని ప్రశంసిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ప్రోత్సాహంతోనే చంద్రయాన్ 3 విజయం సాధించిందని చెప్పారు పవన్ కళ్యాణ్.