బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దాదాపుగా మొదలు పెట్టేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ‘బాద్‌షాహీ మైండ్‌సెట్’ ఉండేదని చెప్పారు. బీజేపీ మాత్రమే సామాజిక న్యాయాన్ని విశ్వాసానికి మారుపేరుగా మార్చిందని అన్నారు.
ఇది రాజకీయ నినాదం మాత్రమే కాకుండా ఎవ్వరి పట్ల వివక్ష చూపకుండా ప్రతి ఒక్కరికి సహాయ పడేందుకు కష్టపడి పనిచేశామని చెప్పారు. తదుపరి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు ఆయన భరోసా ఇచ్చారు. అయితే అంతటితో సంతృప్తి చెందొద్దని ఆయన సూచించారు. 1980 నుంచి ఏ విధంగా పోరాడుతూ వస్తున్నామో.. అదే శక్తితో ప్రతి ఎన్నికల్లో పోరాడాలని ఆయన చెప్పారు. ‘2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించలేరని ప్రజలే అంటున్నారు. అదే నిజం. కానీ ఎన్నికల్లో గెలవడంతో పాటు ప్రతి ఒక్కరి హృదయాలను కూడా గెలవాలి. ఎన్నికల్లో గెలుపు వరకు పరిమితం కాకూడదు’ అని మోడీ అన్నారు.