న్యూఢిల్లీ: దేశంలోకి వేగంగా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఈ రుతుపవనాలు కేరళను తాకాయి. తాజాగా ఈ రుతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. అనుకూల వాతావరణం ఉండటంతో రుతుపవనాలు ప్రస్తుతానికి పంజాబ్ వరకు విస్తరించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ వాయువ్య ప్రాంతం, ఈశాన్య ప్రాంతాలు పశ్చిమ బెంగాల్, గుజరాత్, జమ్మూ కశ్మీర్‌లోకి రుతుపవనాలు విస్తరించలేదు. అయితే ఎవరూ ఊహించని విధంగా రెండు తుపానులు యాస్, టౌటే రావటం వల్ల రుతుపవనాలు వేగంగా కదిలేందుకు మార్గం సుగమం అయింది. యాస్ తుపాను రావటం వల్ల మే 21 నాటికే రుతుపవనాలు అండమాన్ సముద్రాన్ని తాకాయి. కేరళలో పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల జూన్ 3న రుతుపవనాలు తాకాయి.
ఆ తర్వాత అనుకూల వాతావరణం మెండుగా ఉండటంతో దేశంలో చాలా భాగం రుతుపవనాలు విస్తరించాయి. ఇటీవల కాలంలో ఇంత వేగంగా రుతుపవనాలు విస్తరించటం ఇది ఐదోసారి. 2013, 2015, 2018, 2020లలో రుతుపవనాలు వేగంగా దేశమంతటా విస్తరించాయి. 2019, 2017లలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాల రాక బాగా ఆలస్యమైంది. వాయువ్య ప్రాంతంలోకి రుతుపవనాల విస్తరణకు పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు కారణమని వాతావరణ శాఖ చెబుతోంది. గతంలో రుతుపవనాల విస్తరణకు కనీసం ఆరు వారాల సమయం పట్టేది. కానీ దేశంలో పలు ప్రాంతాలలో దాదాపు 60 శాతం మేర భారీ వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగా రావటం వల్ల వేసవి కాలం నిడివి కూడా తగ్గిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. రుతుపవనాల విస్తరణ దేశ పశ్చిమ ప్రాంతాల్లో ఆలస్యం అవటం వల్ల అక్కడ పగటి ఉష్ణొగ్రతలు 40 డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చే సరికి ఇప్పటికే పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులు పంటలు వేస్తున్నారు. దుక్కి దున్ని పొలాలు చదును చేసి విత్తనాలు వేస్తున్నారు. గత రెండు రోజులుగా వాతావరణ చల్లగా మారింది.