తెలంగాణలోని 40 శాతానికిపైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయని వైద్యారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో గత 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ప్రస్తుతం రికవరీ రేటు 90.48 గా ఉందన్నారు. రెండో దశలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.37 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 48,110 యాక్టివ్ కేసులు ఉండగా… ఇప్పటి వరకు 1,92 లక్షల మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా ఉందని వివరించారు.
వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, ప్రజలు కూయా కొవిడ్ నిబంధనలు పాటించడం వల్లనే సత్ఫలితాలు వస్తున్నాయని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సరిపడా పడకలు ఉన్నాయన్న ఆయన… 33 శాతం ఆక్సిజన్ పడకలు, 493 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,265 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 40 శాతానికిపైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయని అన్నారు.
వ్యాక్సినేషన్ మళ్లీ ప్రారంభమయ్యే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. కోవిడ్ బారిన పడిన తర్వాత వచ్చే సమస్యల్లో బ్లాక్ ఫంగస్ ఒకటని,ఇది అంటువ్యాధి కాదని డీహెచ్ స్పష్టం చేశారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కూడా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. వచ్చే రెండు మూడు రోజుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన మందులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.