బాహుబలి సిరీస్ అంటేనే ఎన్నో గుర్తుకు వస్తాయి. ఈ సినిమా కోసం చైతన్య ప్రసాద్ రాసిన పాట మరోసారి స్మరణలో.. ఇవాళ్టి మార్నింగ్ రాగాలో…
హాయైన హంస నావొకటి కావలె
ప్రణయ బాహుబంధనాలలో చిక్కుకోవలె
ఔను! మరోమారు పోయిరావలె మాహిష్మతికి
మహంతీ! ఇదిగో నీ దేవసేన..గాలి తెమ్మెరలతో సయ్యాటలాడుతూ వలపు వీధులలో విహరించు..కొంచెం కొంచెంగా వికసించు సంజె వర్ణాలు బుగ్గలకు పూసి, పున్నాగ పూల పరాగ సరాగం వినిపించు..కాటుక కంటి నదిలో కలల అలల చెంత ఆమెతో కలిసి ప్రయాణించు.. ముద్దాడు.. ప్రేమ నీటి మీద రాత కాదు అని నిరూపించు.
రాజమౌళి సర్! మాకో ఛాన్స్ ఇవ్వండి సర్..దేవసేనతో డ్యూయెట్టు కావాలి.. అది ప్రభాస్ తో చేసిన దాని కన్నా రెండింతలు మూడింతలు హిట్టు కావలె..అదేంటండి ఆ భళ్లాళ దేవుడి చూపులు,.. మరీ అంత క్రౌర్యం పనికిరాదు సర్.. అంతటి ముగ్ధమనోహర సోయగానికి..అన్ని కష్టాలేంటి సర్.. ప్రభాస్ అనుష్క మధ్య మరికొంత ప్రణయ కలాపం తీయాల్సింది సర్..! ఎనీవే మాకు హంస నావ పాట పూర్తి విజువల్ వీడియో కావలె..!వి ఓన్లీ డిమాండ్ ఫర్ దట్.. దేవసేన ఐ లవ్ యూ.. అరె ! నిన్ను ప్రేమించడానికి నీ పెర్మిషన్ కావాలా..! రాజ్యానికో నీతి రాజ్యాంగానికో రీతి ఉన్నట్లే ..ప్రేమకో గీతి ప్రేయసికో స్తుతి తప్పని సరేమో!! చేస్తాను దేవసేన గారూ చేస్తాను!! ఇంకొంచెం ఇంకొంచెంగా చేస్తాను!! మీ దగ్గర నా ప్రేమ అనుమతికి నోచుకునేదాకా .. !! మీతో తడివేదాలు వల్లించాక!! పెదవి లాంఛనం అందుకున్నాక!! వలపు వాయినం ఇచ్చి పుచ్చుకున్నాక !!
“నే నీ ఎదపై
విశాల వీర భూమిపై వశించనా
నేనే వలపై వరాల మాలికై వాలనా..”
ఓ గొప్ప ప్రణయ కావ్యం రాయాలని ఉంది. సందె పొద్దుల్లో ఆమె తలపుల మునకల్లో నిండా మునిగాక ఇంకా ఏం రాయగలను. అంతా అచేతన.ఇప్పుడొక మరణం పిలుస్తున్నా ఇప్పుడో యుద్ధ భూమి పిలుస్తున్నా పట్టింపే లేదు. అబ్బో!! దేహం సరిహద్దులు దాటేసిందీ ప్రేమ. ఏం చేయాలి నిన్ను గెలవాలంటే.. వీరుడు అని అనిపించుకోవాలంటే..నీ నుదిటిపై వీర తిలకమై వాలిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి దేవసేన గారూ!! విల్ యూ ప్లీజ్ సే సమ్ థింగ్ అబౌట్ దీజ్ క్వశ్చన్స్.ఇంకా ప్రేమిస్తానండి మీకు రంగుల లోకం అందిస్తాను. కాదు అమరేంద్ర బాహుబలి కి కూడా సాధ్యం కాని స్థాయిలో నేనే నిర్మిస్తా. ఏది మైదానమో ఏది మైధూనమో మీకు వివరిస్తా..! నా దగ్గర గ్లామర్ అండ్ గ్రామర్ రెండూ పెంచుకుందురు రండి!!
సో.. మాహిష్మతి రాజ్యం ఉన్నా లేకున్నా .. ప్రణయ కాలం తీరు తెన్నూ మారినా మారకున్నా.. దేవసేన గారూ ! హృదయ సామ్రాజ్యం మీదే!! దేదీప్యమానమై వెలుగుతున్న ఆ దీపం చూడండి.. అదిగో మీ కోసమే వస్తున్న ఊహల పల్లకి చూడండి.. ఇంకా.. ఇదిగోఇక్కడే మీకోసమే తీసుకువచ్చిన ఓ గొప్ప రంగుల వాన చూడండి.. అన్నీ అన్నీ హరివిల్లునే మీకు విల్లుగా అందిస్తా.. రండి లోకానికి సరి కొత్త యుద్ధం నేర్పుదురు కానీ .. రక్తసిక్తం కానీ యుద్ధం అది. ప్రేమ కోసం ప్రేమతో చేసే యుద్ధం. ఆయుధం వద్దులేండి. ఆశయం ఒక్కటి చాలు. అదే మీ ప్రేమ గెల వాలన్న ఆశయం. మీ వలపు సీమలో కూసింత చోటు దక్కితే చాలు. ఇస్తారా దేవసేన గారూ!!! కాదంటారా!!! ఇంకా రాయాలండి సరిపోవడం లేదు..మీరు న్నారు కదా!! నా మదిగదిలో అందుకే మరికొంత బిడియం వచ్చి ప్రపంచానికి ఏం చెప్పాలో అన్న దానిపై స్పష్టత రావడం లేదండి. మనిషి స్పష్టాస్పష్టాల మధ్య ఊగిసలాడుతూనే ఉంటాడు లేండి.నాకు అగాధాలూ వద్దు.. అపాయాలూ వద్దు.. ఏకాంత మందిరాన మీతో చల్లని సాయంత్రం గడిపిన చాలు. జన్మ ధన్యం. కృష్ణ య్యా! ఈ పేద వెదురుకు ఆమె పెదాల చెంత వాలే వరమీయవయ్యా!! లవ్ యూ దేవసేనా !! లవ్ యూ!!
ఇప్పుడు మరోసారి వినండి మా చైతన్యుడు రాసిన హంసనావ పాటను.. పులకించిపోండి.. రాజమౌళి ఈ పాట కు అందించిన విజువల్ ట్రీట్ చూసి..! ఏదేతైనేం దేవసేన గారి ప్రేమలో ఉండడం బాగుంది, ఈ ఊహ బాగుంది ఈ కాల్పనిక జగత్తు బాగుంది, లవ్ యూ డియర్,.. గీతగారూ!! ఏమనుకోకండి.. ఇదంతా నా ఎన్త్ టైం ఆఫ్ ఫస్ట్ క్రష్ అనుకుని సర్దుకుపోండి.లవ్ యూ గీతాగారూ.. లవ్ యూ శైలజాగారూ.. లవ్ యూ దేవసేనగారూ అండ్ లవ్ యూ అవంతిక గారూ.. ఇప్పుడిలా అంటాను మీలో ఎవ్వరికి అభ్యంతరం ఉన్నా దేవసేనా నాదే..మిత్రసేనా నాదే ..
డిస్క్లైమర్ : ఇదంతా కేవలం సరదాకి రాసింది.. ఓ అనుష్క అభిమానిగా..
ఆమె అందానికి ఆరాధకుడిగా..దయచేసి ఎవ్వరూ అన్యథా భావింపకండి.
– రత్నకిశోర్ శంభుమహంతి