అదో కిల్లర్ ఫుట్‌పాత్. ఆ ఫుట్‌పాత్ మార్గంలో ఎవరైనా నడిచి వెళ్తే మళ్లీ తిరిగి రారు. వారు పూర్తిగా కనిపించకుండా పోతారు. లేదా.. నీటిలో శవాలై తేలుతారు. మరి.. ఇంత భయానకమైన ఫుట్‌పాత్ ఎక్కడుందో.. ఎందుకంత ప్రమాదకరంగా మారిందో తెలుసుకుందాం.
1419లో ఫౌల్‌నెస్ ఐలాండ్‌కు కాలినడకన వెళ్లేందుకు ఈ ఫుట్ పాత్ నిర్మించారు. ఆరు మైళ్ల దూరం ఉండే ఈ మార్గంలో సగ భాగం ఇసుకతో, మిగతా భాగం నీటితో కప్పేసి ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ గుంతలు ఇసుకతో కప్పి ఉండటం వల్ల ప్రమాదకరంగా మారినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఆ ప్రాంతాల్లో అడుగు వేస్తే అమాంతంగా ఊబిలోకి కూరుకుపోతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వందలాది మంది ఈ ఫుట్‌పాత్ పై ప్రయాణించి ప్రాణాలు తీసుకున్నారు. దీంతో ఈ మార్గానికి ‘డూమ్ వే’ అని పేరు పెట్టారు.
సముద్రం వెనక్కి వెళ్లినప్పుడు ఈ పుట్‌పాత్ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో దీనిపై నడవడం కొంతవరకు సులభమే. అయితే, తప్పుడు వేళల్లో ఈ మార్గంలో నడిస్తే మాత్రం.. సముద్రపు అలల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. వెనక్కి వెళ్లే సముద్రపు నీరు.. చాలా వేగంగా తిరిగి ఈ ప్రాంతానికి చేరుకుంటుంది. ఒక సాధారణ వ్యక్తి పరిగెట్టే వేగం కంటే స్పీడుగా కెరటాలు దూసుకొస్తాయి. ఆ తర్వాత మార్గం కూడా మూసుకుపోయి.. ఎటువెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ ప్రాంతం సైన్యం ఆధీనంలోకి వెళ్లిన తర్వాత.. అనేక యుద్ధ శిక్షణలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో కొన్ని పేలుడు పదార్థాలను ఏర్పాటుచేసినట్లు చెబుతున్నారు. ఎవరైనా పొరపాటున వాటిని తాకితే పేలిపోయే ప్రమాదం ఉందని అక్కడ నోటీస్ బోర్డుల్లో పేర్కొన్నారు. మొదటి ప్రపంచం యుద్ధం నాటి నుంచే ఈ ప్రాంతం సైన్యం ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తే.. సైన్యం కేవలం ఫుట్‌పాత్ ప్రారంభమయ్యే మార్గం వరకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది.