టీపీసీసీ పదవిని చివరి వరకు ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. రాష్ర్ట రాజకీయాల్లో కోమటి రెడ్డి బ్రదర్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ పగ్గాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అధిష్టానాన్ని మచ్చిక చేసుకునేందుకు చాలా రోజులు ఢిల్లోనే మకాం వేశారు. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో… కాంగ్రెస్ అధిష్టానం మరో సహచర ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించింది. దీంతో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కన్న కలలన్నీ కల్లలయ్యాయి. ఇన్నాళ్లు ఊహల లోకంలో విహరించిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా షాక్ ఇచ్చింది.
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంతో అలకబూనిన కోమటి రెడ్డి అధిష్టానానికి తన విముఖత తెలిసేలా ఘాటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలంతా ముక్కున వేలేసుకునేలా.. అసలు టీపీసీసీ ప్రెసిడెంట్ పదవి డబ్బులకు అమ్ముడు పోయిందని బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా తన వద్ద ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు. త్వరలోనే అందరి ముందు ఆధారాలు బయట పెడతానని స్పష్టం చేశారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలతో అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి .
ఎంపీ తమ్ముడు మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా… కాంగ్రెస్ అధిష్టానంపై గుర్రుగా ఉన్నాడని, ఇద్దరూ కలిసి కండువా మార్చుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోక మునుపే కండువా మార్చాలని వీరు యోచిస్తున్నారని సమాచారం.