తెలంగాణలో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సీఎం అవడానికి తమ పాపం కూడా ఉందన్నారు. తన నాన్న 2004లో బీఆర్ఎస్‌కు రెండో, మూడో సీట్లు కాకుండా ఎక్కువ ఇచ్చి ఆ పార్టీని బతికించారని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను కూడా బీఆర్‌ఎస్‌కు సహకరించినట్లు చెప్పారు. కేసీఆర్ గద్దెనెక్కడంలో తమ పాపం కూడా ఉందని తెలిపారు. ఆ పాపం పోగొట్టుకునేందుకు తాను నిజామాబాద్‌లో కవితను ఓడించినట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కవితను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కేసీఆర్‌ను ఓడించేందుకు తాను ముందుంటానని అర్వింద్ తెలిపారు.
నిజామాబాద్ లో గెలుస్తానని ఎమ్మెల్సీ కవిత గప్పాలు కొడుతోందని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. కవిత తన మీద గెలుచుడు కాదు..ఈ ఎన్నికల్లో ఆమె మూడో ప్లేస్ కు వెళ్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ను ఓడగొట్టేందుకు బీజేపీలో కిషన్ రెడ్డి నాయకత్వంలో తానే ముందు నడుస్తానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అన్ని సీట్లు వస్తాయి..ఇన్ని సీట్లు వస్తాయంటూ వారి సొంత ఛానళ్లలో గప్పాలు కొట్టుకున్నా..రాష్ట్రంలో మాత్రం బీజేపీయే అధికారంలోకి వస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అందుకే కిషన్ రెడ్డికి జాతీయ నాయకత్వం అధ్యక్ష పదవి కట్టబెట్టిందని ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లపై క్లారిటీ ఉండదని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ఒక వేళ క్లారిటీ ఉన్నా…పరీక్ష సరిగా నిర్వహించరని..నిర్వహించినా..పేపర్ లీక్ చేస్తారని ఆరోపించారు.