ఇచ్చిన హామీలపై ప్రజల ద్రుష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం… బీఆర్ఎస్ ను మించి పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ కేసు అంటూ ప్రతినెలా ఏదో అంశంపై ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలు తలమీదకు వస్తుండటంతో… కొత్తగా రైతు భరోసా పేరుతో మరో కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శించారు.
ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ అన్నారు. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.12 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.18 వేల రూపాయలు బకాయిపడ్డారని చెప్పారు. ఈ లెక్కన 70 లక్షల మంది రైతులకు రూ.19 వేల 600 కోట్ల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు. ఈ డబ్బులన్నీ జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అట్లాగే నిరుద్యోగులకు ఒక్కొక్కరికి రూ.48 వేలు, మహిళలకు రూ.30 వేల చొప్పున దాదాపు రూ.50 వేల కోట్లు రేవంత్ ప్రభుత్వం బకాయి పడిందన్నారు. అట్లాగే వ్రుద్దులకు రూ.4 వేలు, పేదలకు ఇండ్ల జాగా, రూ.5 లక్షలు, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు పేరుతో లక్ష కోట్లకుపైగా బకాయి పడిందన్నారు. ఈ సొమ్ముంతా జనవరి 26 నాటికి చెల్లిస్తారా? లేదా? రేవంత్ సర్కార్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.