టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి 8 మంది మరణించారు. పాలమూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ప్రసంగిస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడి మరణించారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా అర్ధనాథాలతో మార్మోగిపోయింది.
ఈ ఘటనపై ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి కార్యకర్తలు బలయ్యారని ఆరోపించారు. అప్పుడు పుష్కర ఘాట్ లో 28 మందిని చంపారని.. ఇప్పుడు కందుకూరులో 8 మందిని చంపారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇదేం కర్మ అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు భరత్. బాధిత కుటుంబాలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.