రాజకీయాల్లో నేతలు లేఖలు రాయడం, ప్రజా సమస్యలను ప్రభుత్వాధినేతల దృష్టికి తీసుకురావడం అనేది కామన్‌గా జరిగే ప్రక్రియే! ఈ విషయంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆ పార్టీకి చెందిన నాయకులే లేఖలు రాయడం అనేది ఇటీవల కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రక్రియే. అయితే, దీనిని వ్యతిరేక కోణంలో చూసే ప్రత్యర్థులు వీటిపై యాంటీ ప్రచారం సాగుతుండడం గమనార్హం. తాజాగా నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు.. సీఎం జగన్‌కు ఓలేఖ రాశారు. ఇందులో ఆయన పేర్కొన్న విషయం.. కేంద్రం తీసుకువచ్చిన ఓ నిబంధనను అడ్డుకోవాలని, ఈ మేరకు కేంద్రాన్ని ఒప్పించాలని అభ్యరించడం!
విషయం ఏంటంటే.. దేశంలో ఇటీవల కాలంలో విదేశీ విరాళాలను సేకరించి అక్రమాలకు పాల్పడుతు న్నారని, లెక్కలు కూడా చెప్పడం లేదని, కొన్ని చోట్ల ఉగ్రకార్యక్రమాలు, మత విద్వేషాలు సైతం జరుగు తున్నాయని.. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థల పేరుతో ఈ నిధులు సేకరించి మత మార్పిడులకు కూడా వినియోగిస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయా నిధులపై కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఎఫ్‌సీఆర్ఏ చట్టం ప్రకారం.. విరాళాలు అందుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మరికొన్ని నిబంధనలు ఉన్నాయి.
అయితే, ఇలా చేయడం వల్ల.. విరాళాలపై పన్నులు పడడం సహా.. ఇచ్చేవారిపైనా ఐటీ కంపెనీలు దృష్టి పెడతాయి అంతర్జాతీయంగా వాటిపై ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది వివాదానికి దారితీస్తోంది. ఇదిలావుంటే, వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు సీఎం రాసిన లేఖలో ఈ విషయాన్నే ప్రస్తావించారు. విదేశీ విరాళాలతో తిరుపతిలో .. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రికి ఎంతో మేలు కలుగుతోందని, దీనిలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయని.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. ఈ ఆస్పత్రికి విదేశీ విరాళాలు నిలిచిపోయి.. ఆస్పత్రికి మూతకు దారితీస్తుందని.. కాబట్టి దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించాలనేది ఎంపీ సూచన.
వాస్తవానికి ఈ విషయంపై టీటీడీ ఈవోగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడో.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. స్వయంగా ఆయన వెళ్లి కలిసి వచ్చారు. అయితే, దీనిని తీవ్రంగా తీసుకునే అవకాశం ఉందో లేదో చూడాలి. ఇదిలావుంటే, లావు రాసిన లేఖలో ఉన్న విషయం ఇదైతే.. దీనికి రాజకీయాలు పులిమి.. జగన్‌ను విభేదిస్తున్న ఒక ఎంపీతో ముడిపెట్టి ప్రచారం చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తుండడం గమనార్హం. చిన్న విషయాన్ని కూడా ఇలా రాజకీయాలు చేయడం సరికాదని అంటున్నారు పరిశీలకులు.
-Vuyyuru Subhash