స్పీకర్ జీ.. నన్ను హింసించిన వారిపై చర్యలు తీసుకోండి : ఎంపీ రఘురామ

-

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు లేఖ రాశారు. కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టిన ఐదుగురు పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో ఏపీ సీఐడీ ఏడీజీ పి.వి.సునీల్‌ కుమార్‌, డీఐజీ సునీల్‌ నాయక్‌, ఏఎస్పీ విజయ్‌ పాల్‌, ఏఎస్సై పసుపులేటి సుబ్బారావు, కానిస్టేబుల్‌ మల్లేశ్వరరావు తనను చిత్రహింసలు పెట్టారని రఘురామ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సూచనలతోనే వారు ఆ విధంగా చేశారని ఆరోపించారు.

‘పి.వి.సునీల్‌ కుమార్‌పై అనేక అవినీతి ఆరోపణలతో పాటు గృహ హింస కేసు నమోదైంది. సునీల్‌ నాయక్‌, విజయ్‌పాల్‌ ఉద్యోగ విరమణ చేసినా గత రెండేళ్లుగా ఓఎస్డీలుగా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో నన్ను సికింద్రాబాద్‌ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నివేదికతో కోర్టు బెయిల్‌ ఇచ్చింది. ఈ ఘటనపై నేను సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కమిటీకి ఉన్న అధికారాలతో ఆ అయిదుగురిని వెంటనే పిలిపించి విచారణ చేపట్టాలి. వారిపై విచారణను ఆలస్యం చేస్తే పార్లమెంట్‌పై ఉన్న గౌరవం తగ్గిపోతుంది.’ అని రఘురామ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

సీఐడీ ఏడీజీ పి.వి.సునీల్‌పై ఫిర్యాదు చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖను చర్యల నిమిత్తం కేంద్ర హోం శాఖకు పంపినట్లు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌.రాధా చౌహాన్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version