ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ రాంచీలో కరోనా టెస్టుకు గాను శాంపిల్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాంచీలో ఉన్న ఫాం హౌస్ లో ధోనీ ప్రస్తుతం ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ త్వరలో జరగనున్న ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. అయితే తాజాగా బీసీసీఐ నిబంధనల మేరకు అతను కరోనా శాంపిల్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో టెస్టులో నెగెటివ్ అని నిర్దారణ అయింది.
రాంచీలో ఉన్న ఫాం హౌస్‌లో ధోనీ నుంచి శాంపిల్స్ సేకరించేందుకు గురునానక్ హాస్పిటల్ అండ్ రీసెర్చి సెంటర్ సిబ్బంది వెళ్లారు. అక్కడ ధోనీ నుంచి గురువారం ఉదయం వారు శాంపిల్స్ ను తీసుకుని టెస్టులు చేశారు. దీంతో ఫలితాల్లో కరోనా లేదని వచ్చింది. ఈ క్రమంలో ధోనీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ధోనీకి కరోనా టెస్టు నెగెటివ్ రావడంతో అతను ఐపీఎల్‌లో పాల్గొంటాడని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా కరోనా టెస్టులో నెగెటివ్ రావడంతో ధోనీ శుక్రవారం తమ చెన్నై సూపర్ కింగ్స్ టీంతో కలవనున్నాడు. చెన్నైలో టీం సభ్యులు, సిబ్బంది ప్రస్తుతం ఒక్కొక్కరుగా టీంతో చేరుతున్నారు. ఆగస్టు 20 తరువాత వారు దుబాయ్‌కు వెళ్తారు. ఇక ధోనీ 2022 వరకు టీమిండియాలో ఆడతాడో లేదో తెలియదు కానీ.. అప్పటి వరకు ఐపీఎల్ లో అయితే కచ్చితంగా ఆడతాడని చెన్నై టీం సీఈవో కాశీ విశ్వనాథన్ ఇప్పటికే తెలిపారు. అయితే రానున్న ఐపీఎల్ టోర్నీలో ధోనీ ఎలా ఆడుతాడన్నది కీలకం కానుంది. ఎందుకంటే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్నందున ధోనీ టోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.