మరో 30 ఏళ్లలో ఏకంగా ముంబై నగరమే మునిగిపోతుందట. సముద్రంలో ముంబై నగరం మునుగుతుందని పలువురు సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
మనిషి చేస్తున్న అనేక తప్పిదాలకు ఇప్పటికే పర్యావరణానికి ఎంతగానో నష్టం సంభవించింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆ ప్రభావానికి చెందిన దుష్పరిణామాలను ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్లుగా మన పరిస్థితి తయారైంది. వరదలు లేదా కరువు దేశంలోని అనేక ప్రాంతాల్లో తాండవిస్తున్నాయి. అయితే పర్యావరణానికి కలుగుతున్న నష్టానికి ఇవన్నీ సూచికలే అయినా.. రానున్న సంవత్సరాల్లో ఆ నష్టానికి చెందిన పరిణామాలు మరింత షాక్ కలిగించేంతగా మారనున్నాయి. ఎంతలా.. అంటే.. మరో 30 ఏళ్లలో ఏకంగా ముంబై నగరమే మునిగిపోతుందట. సముద్రంలో ముంబై నగరం మునుగుతుందని పలువురు సైంటిస్టులు తాజాగా చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఐక్య రాజ్య సమితికి చెందిన ఇంటర్‌గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) విభాగం ప్రపంచంలోని 36 దేశాల్లో 100కు పైగా సైంటిస్టులతో అధ్యయనాలు చేపట్టి ఆ తరువాత వచ్చిన ఫలితాలను విశ్లేషించి నివేదిక ఇచ్చింది. అందులో ఇచ్చిన వివరాల ప్రకారం.. మరో 30 ఏళ్లలో.. అంటే.. 2050 వరకు ముంబై నగరం పూర్తిగా అరేబియా సముద్రంలో మునిగిపోతుందని తేలింది. షాకింగ్‌గా ఉన్నా.. ఇది నిజమే అని సైంటిస్టులు చెబుతున్నారు.
హిమానీ నదాలు కరగడం, భూగర్భ జల వనరులు అంతరించిపోతుండడం, కాలుష్యం.. తదితర అనేక అంశాల వల్ల ఆయా సముద్రాలకు చెందిన సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న స్థితి కన్నా అరేబియా సముద్ర మట్టం మరో 100 నుంచి 110 సెంటీ మీటర్లు పెరిగితే ముంబై నగరం సముద్రంలో మునిగిపోవడం ఖాయమని సైంటిస్టులు అంటున్నారు. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న సూరత్, కోల్‌కతా, చెన్నై, అండమాన్ దీవులకు కూడా ఈ ముప్పు పొంచి ఉందని, ఆయా ప్రాంతాలకు దగ్గరలో ఉన్న సముద్ర మట్టాలు మరో 50 సెంటీ మీటర్లు పెరిగితే ఆ నగరాలు కూడా మునిగే అవకాశం లేకపోలేదని సైంటిస్టులు అంటున్నారు. ఏది ఏమైనా.. మానవుడు చేసిన, చేస్తున్న అనేక తప్పిదాలకు ఇలాంటి పరిమాణాలు షాక్ కొట్టినట్లే అనిపిస్తాయి..!