అయోధ్యలో రామమందిర భూమి పూజకు అంతా సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా అగ్రనేతలు, పూజారుల సమక్షంలో ఆగస్టు 5న అట్టహాసంగా ఈ కార్యక్రమం జరగనుంది. రామ మందిర నిర్మాణం జరగాలని ముస్లింలు కూడా ఆకాంక్షిస్తున్నారు. అయోధ్యలోని ముస్లిం మహిళలు అయోధ్య రాముడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ కోసం ప్రత్యేకంగా రాఖీలను సిద్ధం చేస్తున్నారు.
ప్రధాని మోదీ, సీఎం ఆదిత్యనాథ్, ఇంద్రేశ్కుమార్కు రాఖీలను పోస్ట్ ద్వారా పంపిస్తున్నారు ఈ మహిళలు. ఆగస్టు 5న భూమి పూజ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా రాముడి విగ్రహానికి ధరింపజేయనున్నారు.
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న భూమిపూజ కార్యక్రమం త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు మహిళలు. దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. బాబ్రీ మసీదు- రామ జన్మభూమి వివాదం సుప్రీం తీర్పు ద్వారా తీరిపోయిన నేపథ్యంలో దేశ ప్రజలు అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తారని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు ఈ మహిళలు.