మరోసారి వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల నుంచి బస్తాకు రూ.200 చొప్పున దోచుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోందన్నారు నాదెండ్ల మనోహర్. రైతులను దోచుకోవడానికి ఈ పాలకులకు మనసెలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల శ్రేయస్సు పట్టని వ్యక్తి సీఎంగా ఉండటం వల్లే రైతన్నలు, కౌలు రైతులు జీవితంపై విరక్తి చెందుతున్నారని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాం.. ఆఫ్రికా కూడా ఆదర్శంగా తీసుకుంటోందని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులు వరి రైతుల బాధలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
“రైతులకు భరోసా ఇవ్వని కేంద్రాలు ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి? ఆర్బీకేల్లో ధాన్యం అమ్మడానికి వెళ్ళిన రైతులకు ఎదురౌతున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. దళారులకు నిలయాలుగా ఆర్బీకేలు మారిపోయాయి. రైస్ మిల్లర్లు రైతుల బాధలను ఆసరాగా చేసుకొని గిట్టుబాటు ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రైతుల ఆధార్ వివరాలు నమోదు చేయకుండా మిల్లర్లు, రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు, పౌరసరఫరాల శాఖ చేస్తున్న మాయ వల్ల అన్నదాతలు మోసపోతున్నారు. వేల మంది రైతుల చిరునామాలు గల్లంతు చేసి కుంభకోణానికి తెర తీశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం తేలిగ్గా తీసుకొంది. ఇది ఒక సమస్యే కాదని ఉన్నతాధికారులు, మంత్రులతో చెప్పించడం ద్వారా ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలెవరో అర్థమవుతోంది.