వారాహి యాత్రను ఆపితే పాదయాత్రకు సిద్ధమేనని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు పేర్కొన్నారు. వారాహి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై స్పష్టత రాలేదని తెలిపారు. అనంతపురంలోని చెరువుకట్ట రోడ్డుపై ఏర్పడిన గుంతలను శ్రమదానంతో పూడ్చే కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన నగరంలోని ఓ హోటల్‌లో జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, పార్టీ స్థితిగతులపై జనసేన కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో సాగుతున్న నియంతృత్వ పాలన పోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాల్సి ఉందని జనసేన పార్టీ నేత నాగబాబు అన్నారు. పాలకులు బెదిరింపులతో.. రాజకీయ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని.. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. జనసేన కార్యకర్తలను బెదిరిస్తున్నారని అన్నారు. ఏ ఒక్క రైతుకూ న్యాయం చేయలేదన్నారు. ఇలాంటి నాయకులను విమర్శించడం కంటే.. ప్రజలే సరైన సమాధానం చెబుతారన్నారు.