ఏపీ కరెంట్ కోతలపై జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంటు కోతలే ఉండవన్న కోతలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. పరిశ్రమలను మూసేస్తే కార్మికుల పరిస్థితి ఏమిటి ? అని ఆగ్రహించారు. గంటల తరబడి కరెంటు కోతల వలన ప్రజలు అవస్థలకు గురవుతున్నారన్నారు. వేసవిలో విద్యుత్ కొరతను నివారించేందుకు ఏం చేశారో వైసీపీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని పవన్ కళ్యాణ్ ముందే చెప్పారని స్ఫష్టం చేశారు జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు. విద్యుత్ సంక్షోభం అధిగమించేందుకు జనసేనకు ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉత్పాదక కొరత కారణం చూపి గత నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార రంగంలోని ఆరు చక్కెర కర్మాగారాలు మూసేశారని వెల్లడించారు. ఆస్తుల అమ్మకానికి జీవో నెంబర్ 15 ను జారీ చేసారు.. ఫలితంగా వందలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇప్పుడు విద్యుత్ కొరత పేరుతో పరిశ్రమలు మూసేస్తే కార్మికుల ఉపాధి కోల్పోతారని వివరించారు.