కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.సీఎం బసవరాజు బొమ్మైని మార్చాలని భాజపా అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా..బెంగళూరు పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగవచ్చు జరగచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇటీవల హిజాబ్, హలాల్, లౌడ్ స్పీకర్ వంటి వివాదాలు కర్ణాటకను కుదిపేశాయి.దీనికి తోడు ఓ గుత్తేదారు ఆత్మహత్య వ్యవహారంలో రాష్ట్ర మంత్రి పై ఆరోపణలు రావడం బొమ్మై సర్కార్ ను ఇరుకున పడేసింది.2023 లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదాలు భాజపాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే బొమ్మై ని మార్చి ఆయన స్థానంలో మరొకరిని రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఇటీవల పార్టీ జాతీయ సెక్రటరీ బిఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు..ఈ ఊహాగానాలకు తెర లేపాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం భాజపా అధిష్టానానికి ఉందని సంతోష్ అన్నారు.గుజరాత్ లో చేసినట్లుగానే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు.దీంతో బొమ్మై సీటు నుంచి దిగడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు అవాస్తవమని మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత ఎడ్యూరప్ప తెలిపారు.