నాగంకు లాస్ట్ ఛాన్స్..నాగర్‌కర్నూలులో సెంటిమెంట్‌తో పట్టు!

-

నాగం జనార్ధన్ రెడ్డి…తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు తెలంగాణలో కీలక నేతగా వ్యవహరించిన నాగం..ఇప్పుడు ఒక్క గెలుపు దక్కితే చాలు అనుకునే పరిస్తితి. ఎన్టీఆర్ పిలుపుతో నాగం రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీలో చేరారు. 1985 ఎన్నికల్లో  నాగర్‌కర్నూలు నుంచి బరిలో దిగి తొలి విజయం అందుకున్నారు. ఆ తర్వాత 1989 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇక ట్డ్ప ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.

అటు ఎన్టీఆర్‌కు, ఇటు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు. ఇక ఒకానొక సమయంలో టి‌డి‌పిలో నెంబర్ 2గా ఉన్న పరిస్తితి. అలాంటి నేత తెలంగాణ ఉద్యమ సమయంలో ఇబ్బందులు పడ్డారు. ఇక ఆయన కూడా ఉద్యమం వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 2011 లో టి‌డి‌పి నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో తెలంగాణ నగరా సమితి అని పార్టీ పెట్టారు. అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012 నాగర్‌కర్నూలు ఉపఎన్నికలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు.

ఇక అదే నాగంకు చివరి గెలుపు..తెలంగాణ వచ్చాక ఆయన రాజకీయ జీవితం ఊహించని మలుపులు తిరుగుతూ వచ్చింది. తెలంగాణ వచ్చాక ఆయన బి‌జే‌పిలో చేరారు. 2014 ఎన్నికల్లో మహబూబ్‌నాగర్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బి‌జే‌పిలో ఇమడలేకపోయారు. దీంతో కాంగ్రెస్ లోకి వచ్చారు. 2018 ఎన్నికల్లో మళ్ళీ తన సొంత స్థానం నాగర్‌కర్నూలులో పోటీ చేశారు. కానీ 54 వేల ఓట్ల భారీ మెజారిటీ తేడాతో బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధి మర్రి జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

అయితే వయసు మీద పడటం వారసులు కూడా లేకపోవడంతో…నెక్స్ట్ ఎన్నికలే చివరి ఎన్నికలని నాగం ముందుకెళుతున్నారు. ఇదే చివరిసారి పోటీ చేయడమని అండగా ఉండాలని నాగర్‌కర్నూలు ప్రజలని కోరుతున్నారు. ప్రస్తుతానికి అక్కడ బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే బలంగానే ఉన్నారు. ఇటు కాంగ్రెస్ బలం కూడా పెరుగుతుంది. దీంతో ఈ సారి పోరు హోరాహోరీగా ఉండేలా ఉంది. ఒకవేళ నాగం చివరి ఎన్నికల సెంటిమెంట్ ఫలిస్తే గెలుపు ఖాయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version