ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోను రైతులు, రైతు కూలీలు, మహిళలు నిబంధనలు పాటిస్తూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు, ఆందోళనలు ఆదివారం నాటికి 250వ రోజుకు చేరుకున్నాయి. దీంతో రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో సేవ్ అమరావతి పేరుతో నిరసన దీక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలోని రైతులు కొందరు అమరావతి రైతులకు మద్దతు పలికారు.
మొక్కలు నాటి మరీ అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 250 రోజులుగా అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే బ్రిటీష్ వాళ్లు అయినా స్పందించి ఉండేవారన్నారు. జగన్‌కు చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం దారుణం అని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రభుత్వాన్ని నగరి రైతులు డిమాండ్ చేశారు. అలాగే ఈ మూడు రాజధానుల అంశాన్ని నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే రోజా వ్యతిరేకించాలని వారు కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తే ఎమ్మెల్యే రోజాకి ఇది గట్టి షాకే అనుకోవాలి.