టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక

-

తెలంగాణలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎదుర్కోబోతున్న మూడో ఉపఎన్నిక నాగార్జునసాగర్‌. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఇక్కడి సిట్టింగ్‌ స్థానం ఖాళీ అయింది. ఇంకా షెడ్యూల్ రాలేదు. కాకపోతే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలిచినా.. దుబ్బాక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపన్న ప్రచారానికి బ్రేక్‌ పడింది. లోకల్, నాన్‌లోకల్‌, సామాజికవర్గాల పేరుతో గులాబీ పార్టీ కుస్తీ పడుతుంది…


దుబ్బాకలో అభ్యర్థే మైనస్‌ అని టీఆర్‌ఎస్‌లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. నాగార్జునసాగర్‌లో అలాంటిది రిపీట్‌ కాకూడదని గట్టిగా భావిస్తున్నారట. అయితే నియోజకవర్గంలో స్థానికంగా ఆ పార్టీకి బలమైన నేత లేకపోవడం సమస్యగా మారిందని చర్చ జరుగుతోంది. నోముల నర్సింహయ్య స్థానికేతరుడు అయినప్పటికీ నాగార్జునసాగర్‌లోని సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని అప్పట్లో బరిలో దించింది టీఆర్‌ఎస్‌. 2014లో ఓడినా.. 2018లో మాత్రం 7వేల మెజారిటీతో గెలిచారు నోముల. ప్రస్తుత ఉపఎన్నికలో నోముల కుటుంబానికి టికెట్‌ ఇస్తే.. విపక్ష పార్టీల అభ్యర్థులను ఏ మేరకు ఢీకొడతారు అన్నది ప్రశ్నగా ఉందట.

దుబ్బాక చేదు ఫలితాన్ని ఇవ్వడంతో మరోసారి అలాంటి సాహసం చేయకూడదనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ఉపఎన్నికలో పోటీకి ఆసక్తి చూపుతారో లేదో తెలియదు. ఒకవేళ కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొస్తే స్థానిక గులాబీ నేతలు ఎంత మేరకు కలిసి పనిచేస్తారో అన్న అనుమానం ఉందట. నోముల మాదిరి బయటి వారిని డంప్‌ చేస్తే స్థానిక కేడర్‌ స్వాగతిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ ప్రత్యర్థి పార్టీలు లోకల్‌ అభ్యర్థిని బరిలో దించితే మాత్రం..లోకల్‌ నాన్‌ లోకల్‌ సమస్య వచ్చి అది ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని కొందరు నేతలు హెచ్చరిస్తున్నారట.

టీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు జరిగిన చర్చల ప్రకారం నాగార్జునసాగర్‌లో బీసీ సామాజికవర్గానికి చెందిన వారికే టికెట్‌ ఇస్తుందని సమాచారం. ఆ దిశగానే అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టారట పార్టీ నేతలు. నియోజకవర్గంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. అయితే ఇతర పార్టీల కంటే ముందుగానే అధికార పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version