భూ ప్రక్షాళన చేద్దామనుకుని కేసీఆర్ చేతులు కాల్చుకున్నారా !

-

తెలంగాణలో సమీకృత భూరికార్డుల యాజమాన్యం విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ధరణి వెబ్‌పోర్టల్‌ను తీసుకొచ్చింది. భూ రికార్డులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఎక్కించాలని నిర్ణయించారు పాలకులు. అవినీతిని అరికట్టేందుకు వ్యవస్థను ప్రక్షాళన చేద్దామని అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి. దేశానికే ఆదర్శంగా ఉందామని భావిస్తే మరేదో జరిగింది.

భూ పరిపాలన, రిజిస్ట్రేషన్‌ సేవలు రెండింటినీ అనుసంధానం చేసే అధునాతన వ్యవస్థను తీసుకొస్తే అంతా పారదర్శకంగా.. జవాబుదారీతనంగా.. మరింత రక్షణాత్మకంగా జరుగుతాయని భావించారు. ఇవన్నీ జరిగితే ఎలా ఉండేదో ఏమో కానీ.. ప్రభుత్వం అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటి. వ్యవస్థలో భారీ మార్పు తీసుకొచ్చే సమయంలో ఎదురయ్యే సమస్యలపై లోతుగా చర్చించేదని ప్రభుత్వ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రిజిస్ట్రేషన్ల విషయంలో పాత పద్ధతిని కొనసాగిస్తూనే.. కొత్త పద్ధతిని సమాంతరంగా తీసుకొస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నాయి. మా బాస్‌ ఈ మాత్రం కూడా ఆలోచన చేయలేకపోయారని సంబంధిత ప్రభుత్వ విభాగం అధికారులు కామెంట్ చేస్తున్నారట.

వంద రోజులపాటు రిజిస్ట్రేషన్స్‌ ఆగిపోయాయి. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒకరకంగా ధరణి విషయంలో ప్రభుత్వం పరువు పోయిందని టీఆర్‌ఎస్‌ వర్గాల్లోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇంత పెద్ద సంస్కరణ తీసుకొచ్చే ముందు స్టేక్‌ హోల్డర్స్‌తోపాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది ఆలోచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి కసరత్తు ఏదీ జరగలేదు. అనుకున్నదే తడవుగా ఆగమేఘాలపై నిర్ణయాలు తీసేసుకున్నారు. చివరకి చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది.

ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో జనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ మేరకు ప్రభుత్వం వారికి భరోసా కల్పించలేకపోయిందనే విమర్శ ఉంది. సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సమయంలో కొందరు కలెక్టర్లు గ్రౌండ్‌లెవల్‌లో వచ్చే సమస్యలు ప్రస్తావించినప్పుడు పెడచెవిని పెట్టారని చెబుతున్నారు. ఆనాడే కాస్త దృష్టి పెట్టి ఉంటే ఇలా అయ్యేది కాదని రెవెన్యూ వర్గాల్లో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతాయని.. తొందరపడొద్దని అప్పట్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చెబితే ఆయన్ని పక్కన పెట్టేశారట. సమస్య చేతులు దాటిపోతున్న సమయంలో సీఎస్‌తోపాటు పదిమంది సీనియర్‌ ఐఏఎస్ లు ఈ సమస్యపైనే ఫోకస్‌ పెట్టినా కొలిక్కి తీసుకురాలేకపోయారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ముందు వేయాల్సిన కేబినెట్‌ సబ్‌ కమిటీని.. సమస్య శ్రుతిమించాక వేశారు. ఆ కమిటీ రియాల్టర్లు, బిల్డర్స్‌తో సమావేశమైనా వెబ్‌పోర్టల్ సమీప భవిష్యత్‌లో దారిలో పడే అవకాశం లేదని తెలిసి.. చేతులు ఎత్తేసిందని చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలను ఒక అవకాశంగా తీసుకుని పాతపద్దతిలో రిజిస్ట్రేషన్స్‌కు పచ్చ జెండా ఊపారు. మొత్తానికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు పైనుంచి కింద వరకు ప్రతిఒక్కరూ నిస్సహాయులుగానే ఉండిపోయారు. చివరకు ధరణి విషయంలో ప్రభుత్వం అభాసుపాలైంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version