త్వరలో రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ కుమార్తె, మాజీ కేంద్రమంత్రి, భాజపా నాయకురాలు పురంధరేశ్వరీ వైసీపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 2019లో ఏపీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో మరింత కాకపుట్టించనున్నాయి. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటికే చంద్రబాబు అనేక ఎత్తుగడలను వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రతో పెరిగిన జనాధరణను ఓటు రూపంలో మార్చుకునేందుకు వైసీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భాజపా ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరనుండగా, మంత్రి భూమా అఖిలప్రియ సైతం జనసేనలో చేరనున్నారని పుకార్లు రాగా ఆమె వాటిని ఖండించారు.
జగన్ పాదయాత్రతో హుషారుగా ఉన్న వైసీపీ.. మరింత మంది నేతలను చేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో తెదేపాను మట్టి కరిపించొచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి రాకను జగన్ సైతం స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడు హితేష్‌కు పర్చూరు అసెంబ్లీ సీటుతో పాటు తనకు గుంటూరు లేదా నరసరావుపేట ఎంపీ టిక్కెట్ కావాలని ఆమె పట్టుబడుతున్నారట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల 21న ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.