ఏపీ రాజకీయాల్లో మంచి క్రేజ్ ఉన్న యువనాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి byreddy siddharth reddy ఒకరు. తన పెదనాన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధార్థ్, తర్వాత తన పెదనాన్నతో విభేదించి వైసీపీలో చేరి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. తన పవర్‌ఫుల్ స్పీచ్‌లతో వైసీపీలో ఉన్న యువతని ఆకట్టుకున్నారు. అందుకే రాష్ట్రమంతా బైరెడ్డికి ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇలా ఫాలోయింగ్ తెచ్చుకున్న బైరెడ్డికి ఇటీవల వైసీపీ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థ్‌ను నియమించారు. ఇక బైరెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా పనిచేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీతో గెలవడానికి బైరెడ్డి ఒక కారణం. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గమైన నందికొట్కూరులో ఆర్థర్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచారు.
అయితే ఆ తర్వాత నుంచి ఆర్థర్, బైరెడ్డిలకు పెద్దగా పడటం లేదు. ఇప్పటికే పలుమార్లు ఈ రెండు వర్గాల మధ్య పెద్ద రచ్చ కూడా జరిగింది. అలాగే వైసీపీ అధిష్టానం పలుమార్లు ఈ రచ్చకు బ్రేక్ వేసేందుకు చూసింది. అయినా సరే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే బైరెడ్డికి నామినేటెడ్ పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. పదవి రావడంతో బైరెడ్డి అనుచరులు, అభిమానులు ఆనందంగానే ఉన్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇస్తే బెటర్ అనే అభిప్రాయం కొందరు వైసీపీ కార్యకర్తల్లో ఉంది. బైరెడ్డి లాంటి వారు ఎమ్మెల్యేగా ఉంటే వైసీపీకే అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. అయితే నందికొట్కూరు ఎస్సీ రిజర్వడ్ కాబట్టి వేరేచోట బైరెడ్డికి సీటు ఇవ్వాలి. కానీ కర్నూలు జిల్లా వైసీపీలో ఖాళీలు లేవు. 14 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ బైరెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కడం కాస్త డౌటే అని చెప్పొచ్చు.