కర్నూలు జిల్లా నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆధిపత్య పోరును సర్దుబాటు చేసే ప్రయత్నంలో వైసీపీ అధిష్టానం వెనుబడినా అధికారులు కొత్త దారి చూపారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య అస్సలు పడదు. ఎవరికి వారు తమ మాట చెల్లుబాటు కావాలని భావిస్తారు. తనపై పెత్తనం చేయాలని చూస్తున్నారని సిద్ధార్థరెడ్డిపై ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు ఆర్థర్. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న ఓ వివాదానికి ఆసక్తికర ముగింపునిచ్చారు స్థానిక అధికారులు.
తాజాగా రేషన్ షాపుల నుంచి ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వాహనాలు సమకూర్చింది. ఈ అంశంలో రెండు వర్గాలు ఎప్పటిలాగే ఆధిపత్య పోరు ప్రదర్శించాయి. నందికొట్కూరు నియోజకవర్గానికి 61 వాహనాలు కేటాయించారు అధికారులు. లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. తుది నిర్ణయం తీసుకునే సమయంలో ఒక్క పాములపాడు మినహా మిగిలిన మండలాల్లో సిద్ధార్థరెడ్డి సూచించిన జాబితాను ఫైనల్ చేయాలని అధికారులపై ఒత్తిడి వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్థర్.. పార్టీ జిల్లా ఇంఛార్జ్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాను ఎమ్మెల్యే అయినా ఒక్క మండలానికే పరిమితం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒక దశలో తాను ఫైనల్ చేసిన జాబితా పక్కన పెడితే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని ఎమ్మెల్యే ఆర్దర్ హెచ్చరించాడు. దీంతో విషయం ముదిరి పాకన పడింది. పార్టీ నేతలు ఈ సమస్యను కొలిక్కి తెస్తారని ఎదురు చూసినా..ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం లేపోవడంతో.. వారే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చారట. పాములపాడు మండలం ఎమ్మెల్యేకు, పగిడ్యాల మండలం సిద్ధార్థరెడ్డికి ఇచ్చే విధంగా ఒప్పించారట అధికారులు. మిగిలిన 4 మండలాలలతోపాటు నందికొట్కూరు అర్బన్, రూరల్ పరిధిలో ఇద్దరికీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తామని ప్రతిపాదన సిద్ధం చేశారట. అంటే సగం మంది లబ్ధిదారులను ఎమ్మెల్యే ఎంపిక చేస్తే.. మిగిలిన సగం మందిని సిద్ధార్థరెడ్డి ఫైనల్ చేసేలా ఢీల్ కుదిర్చారట.
సొంత మండలాల్లో ఇంకొకరు జోక్యం చేసుకోకుండా ఒప్పందం ఓకే అయిందట. దీనికి రెండు పక్షాలు ఒప్పుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నట్టు సమాచారం. ఇప్పటికి ఇది ఓకే.. మరి రాబోయే రోజుల్లో వీరి మధ్య గొడవలొస్తే అప్పుడు కూడా అధికారులే సర్ధుబాటు చేస్తారా అన్న చర్చ నడుస్తుంది.