సినిమా తీశాక ప్రతిభ ఒక్కటే మాట్లాడాలని అనుకోవడం తప్పేం కాదు. ఆ మాటకు వస్తే ఎప్పుడయినా మాట్లాడేది ఒక వ్యక్తి జ్ఞానం అతను లేదా ఆమె సాధించిన విజయం. ఇవే ప్రామాణికాలు అవుతాయి. డైరెక్టర్ నందినీ రెడ్డి కూడా కోరుకుంటున్నది ఇదే!
ఇండస్ట్రీలో మంచి సినిమా ఎవ్వరైనా తీయొచ్చు. లేడీ డైరెక్టర్ కనుక మంచి సినిమా తీశారు అని చెప్పడంలో అర్థం లేదు భావ్యం అంత కన్నాలేదు. ఎందుకంటే ఈ కథనం చదవండిక.
స్త్రీ,పురుషులు ఇద్దరూ సమానం అని అంటారు. ఇండస్ట్రీలో కానీ,బయట కానీ అటువంటి భావం ఏదీ అమలులోనే ఉండదు. ఆచరణలో తూగని మాటలను ఎందుకు చెప్పడం. అందుకే ఇద్దరూ సమానం అని చెప్పడం మానుకోవాలి ఇకపై అయినా! అసలు మనుషులను జెండర్ ను దృష్టిలో ఉంచుకుని వారి క్యాపబులిటీని నిర్దేశించడం, నిర్ణయించడం తప్పు. కానీ దౌర్భాగ్యం మన దేశంలో జరిగేదే ఇది. తాజాగా ఇటువంటి వాటిపై డైరెక్టర్ నందినీ రెడ్డి గళం వినిపించారు.తనదైన పంథాలో సమాధానం చెప్పారు కూడా! ఆ వివరం ఈ కథనంలో!
సుమన్ టీవీ అవార్డుల ఫంక్షన్ లో డైరెక్టర్ నందినీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దయచేసి లేడీ డైరెక్టర్ అనే కేటగిరీ ఉంచవద్దు.. తీసేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. ఓ సినిమా విషయంలో మగవాళ్లు పడే కష్టం,ఆడవాళ్లు పడే కష్టం ఒకటేనని, సినిమా నచ్చితే అవార్డు ఇవ్వండి కానీ జెండర్ చూసి మాత్రం అవార్డు ఇవ్వకండి అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడి అందరి అభినందనలు అందుకున్నారు. ఆమె డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమాకు కు గాను ఉత్తమ లేడీ డైరెక్టర్ విభాగంలో అవార్డు ఇవ్వడం పై తన అభ్యంతరాలు చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు.
అదేవిధంగా అవార్డును రాజేంద్రప్రసాద్ ఎదుట తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇదే సందర్భంలో వేడుకలకు విచ్చేసిన బాబు మోహన్ (సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు, కమెడియన్) ను తనకున్న అనుబంధం గురించి కూడా చెప్పారామె. అంతఃపురం సినిమా తన మొదటి సినిమా అని, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే నేను మంచి డైరెక్టర్ ను అవుతానని ఆ రోజే ఆయన విశ్వసించి దీవించారని చెబుతూ, నాటి రోజులను మరో సారి గుర్తు చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించారు.