వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలపై లోకేష్ ట్వీట్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ లోకేష్ ఆరోపణలు చేశారు. సంక్రాంతికి ప్రేక్షకులకు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వస్తున్న బాల మావయ్య, వాల్తేరు వీరయ్యగా వస్తున్న చిరంజీవి శుభాకాంక్షలు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. అలరించే పాటలు, ఆలోచింపజేసే మాటలు, ఉర్రూతలూగించే డ్యాన్సులతో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాలను కోట్లాది ప్రేక్షకులలో ఒకడిగా నేనూ చూడాలని తహతహలాడుతున్నానని ఆయన అన్నారు. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమైందని, ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భాన్ని వాడుకుని సోషల్మీడియాలో ఫేక్ ఖాతాల ద్వారా ఒక కులం పేరుతో మరో కులంపై విషం చిమ్మాలని కుట్రలు పన్నారని ఆయన మండిపడ్డారు.
విషప్రచారాలు చేసి కుల,మత,ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిల్చిన దుష్ట చరిత్ర గలిగినవారి ట్రాప్‌లో ఎవరూ పడొద్దని, సినిమాలు అంటే వినోదమన్న నారా లోకేష్.. సినిమాలను వివాదాలకు వాడుకోవాలనే అధికార పార్టీ కుతంత్రాలను తిప్పికొడదామన్నారు. మనమంతా ఒక్కటే అని, కులం, మతం, ప్రాంతం ఏవీ మనల్ని విడదీయలేవని ఆయన పేర్కొన్నారు.