ఏపీలో రాజకీయం ఇప్పుడు ఇప్పటం చుట్టూ తిరుగుతోంది. అయితే.. తాజాగా నేడు సాయంత్రం 4 గంటలకు ఇప్పటం గ్రామంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఇటీవల ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం కూల్చిన ఇళ్ళను పరిశీలించి, బాధితుల్ని పరామర్శించనున్నారు నారా లోకేశ్. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొననున్నారు నారా లోకేశ్. ఇదిలా ఉంటే.. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం బయలుదేరిన పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పవన్ పర్యటన దృష్ట్యా జనసేన కార్యాలయం ఎదుట మొహరించిన పోలీసులు, పవన్ వెళ్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు.
దీంతో పవన్ కారు దిగి జాతీయ రహదారిపై నడక ప్రారంభించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. కొద్ది దూరం కాలినడకన వెళ్లిన పవన్ కళ్యాణ్ కొద్ది దూరం వెళ్లాక తన వాహనంలో ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటం చేరుకున్న జనసేనాని, అక్కడ కూల్చివేసిన నివాసాలను పరిశీలించారు. పవన్ పర్యటన దృష్ట్యా ఇప్పటం గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇళ్లు కూల్చివేసిన బాధితులకు పవన్ సంఘీభావం ప్రకటించారు. ఇప్పటం గ్రామ ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.