రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ పాలన ప్రారంభించి ఏడాది పూర్తయింది. నిజానికి ఈ ఏడాదికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అసలు పాలనే చేతకాని దద్దమ్మ.. నేరస్తుడు.. అలాంటి వ్యక్తికి అధికారం ఎలా ఇస్తారు? అంటూ.. ప్రధాన ప్రతిపక్షం సహా మిగిలిన విపక్షాలు సైతం దుమ్మెత్తి పోసినా.. ప్రజలు మాత్రం ఆయనకు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ దృష్టి పెట్టారు. అంతేకాదు.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా జగన్ పాలన తీరుపై ఓ కన్నేసి ఉంచింది. ఇక, పక్కనే ఉన్న రాష్ట్రాలు కూడా జగన్ పాలనను అడుగడుగునా గమనించాయి.
దాదాపు ఏడాదిన్నర కాలం పాటు తన పాదయాత్రతో ప్రజల మధ్యే ఉన్న వైసీపీ అదినేత జగన్.. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే కీలక అంశాలతో ఆయన మేనిఫెస్టో తయారు చేసుకుని ప్రజలకు హామీలు గుప్పించారు. ప్రజలు జగన్‌ను నమ్మారు.. ఆయనను గద్దెనెక్కించారు. అది కూడా అలా ఇలా కాదు.. అదిరిపోయే మెజారిటీతో. అలాంటి నాయకుడు పాలన ప్రారంభించి ఏడాది పూర్తయింది. మరి ఈ ఏడాది కాలంలో ప్రజలకు జగన్ ఎలా చేరువయ్యారు? అనే విషయంలో జాతీయ మీడియా టైమ్స్ ఓ కథనాన్ని ఆదివారం తన సంచికలో భారీగా ప్రచురించింది.
అదే.. గ్రామ సచివాలయాలు. ఇది బాగా అద్భుతమైన పథకంగా జాతీయ మీడియా కొనియాడింది. గతంలో జన్మభూమి కమిటీలు ఉన్నప్పటికీ.. అవినీతికి ఆలవాలంగా.. మారిపోవడంతో వాటిని ప్రారంభించిన అప్పటి సీఎం చంద్రబాబు చివరికి వాటిని సస్పెండ్ చేసి.. కలెక్టర్లకే అధికారాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, జగన్ తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా వలంటీర్లు.. సచివాలయ సెక్రటరీలు.. ప్రజల మధ్యకు వచ్చారు.
అదే సమయంలో అవినీతికి తావు లేకుండా పక్కా ప్రణాళికతో వాటిని అమలు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వం చేరువైందనేది ఈ మీడియా కథనం. దీనిపై గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ, నగర ప్రాంతాల్లోనూ ప్రభుత్వం చేరువైందని తెలిపింది. ఇది జగన్ ప్రభుత్వంలో మిగిలిన పథకాలకన్నా కూడా మైలు రాయిగా అభివర్ణించడం విశేషం.