కేరళలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి 7:30 గంటలకు మలప్పురం జిల్లాలోని తన్నూరు సమీపంలో పురపూజా నదిలో ఓ డబుల్ డెక్కర్ పడవ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 22 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే 30 మందికి మించి ఇందులో ఎక్కువగా పడవ ఎక్కినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటివరకు 22 మంది మృతదేహాలను వెలికి తీశారు. 8 మందిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఇంకా గల్లంతయిన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాద బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు సీఎం పినరై విజయన్. ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు.