దిల్లీలో వరద ఉద్ధృతిలో రావూస్ ఐఏస్ కోచింగ్ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో దిల్లీ మున్సిపాలిటీ చర్యలకు ఉపక్రమించింది. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను అధికారులు సీల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
ఈ దుర్ఘటనపై దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు రావూస్ కోచింగ్ సెంటర్‌లో డ్రైనేజీ వ్యవస్థ, భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో నేరపూరిత హత్య, ఇతర అభియోగాల కింది అరెస్టైన కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌కు కోర్టు 14రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు ఈ దుర్ఘటన తమను కలచివేసిందని, విచారణలో అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఓ ప్రకటన విడుదల చేసింది.