ట్రాక్టర్లతో రోడ్డెక్కిన రైతులు.. దిల్లీలో హై టెన్షన్.. నెలరోజులు 144 సెక్షన్

-

‘దిల్లీ చలో’లో పాల్గొనేందుకు పంజాబ్, హరియాణా రైతులు ట్రాక్టర్లు, డీసీఎం, ట్రాలీల్లో పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ నేపథ్యంలో దిల్లీ- హరియాణా సరిహద్దు వద్ద పోలీసులు, భద్రత బలగాలు మరింత అప్రమత్తమై రైతులను శంభూ సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. మరోవైపు దిల్లీ నలువైపులా భారీస్థాయిలో భద్రతా బలగాల మోహరించారు. ఇండియా గేట్‌, పార్లమెంట్‌కు వెళ్లే దారుల్లో భారీ భద్రత ఏర్పాటు చేసి రోడ్లపై బారికేడ్లు, సిమెంట్ దిమ్మలు, ఇనుప కంచెలు ఉంచారు.

పంజాబ్, హరియాణా, పశ్చిమ యూపీ నుంచి దిల్లీ వచ్చే మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. హైవేలు, దిల్లీకి అనుసంధానంగా రోడ్లను మూసివేశారు. వచ్చే నెలరోజులు దిల్లీలో 144 సెక్షన్‌ను విధించారు. దిల్లీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లతో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దిల్లీ చలో కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని రైతు సంఘాలు ఖండించాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరితే అణిచివేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news