నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘం దిల్లీలోని జవహర్ వ్యాపార్ భవన్‌లో తొలి సారి భేటీ అయింది. కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, ఏనీ జార్జ్ మాథ్యూ, సౌమ్య కాంతి ఘోష్ ఈ భేటీలో పాల్గొన్నారు. డిసెంబరు 31వ తేదీన కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం విధి విధానాలపై చర్చించారు. తదుపరి వివిధ భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, నిపుణులతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
ఆర్థిక వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషణ జరపాలని, ఇందుకోసం వివిధ రంగాల్లోని నిపుణుల సేవలను వినియోగించుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ పరిశోధన సంస్థలు, మేధావులు, ఆర్థిక విషయాల్లో పని చేసే వివిధ సంస్థలను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. జవహర్ వ్యాపార్ భవన్‌లో ఆర్థిక సంఘం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఈ సంఘం 2025 అక్టోబరు 31వ తేదీలోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్లపాటు అమల్లో ఉంటాయి.