భారతప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ దిశగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువుదీరిన 18వ లోక్సభ తొలి సెషన్ జూన్ 15న ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. సభ సభ్యులుగా కొత్తగా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలతో ఈ సెషన్ ప్రారంభం కానుంది.
రెండు రోజులపాటు ప్రమాణస్వీకార కార్యక్రమాలు కొనసాగిన అనంతరం కొత్త స్పీకర్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి సెషన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. సమావేశాల నిర్వహణ తేదీలను కొత్త కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తుంది. ఈ సెషన్‌లో ప్రధానిమోదీ తన మంత్రిమండలి సభ్యులను ఉభయ సభలకు పరిచయం చేస్తారు. జూన్ 22వ తేదీన సమావేశాలు ముగిసే అవకాశముంది. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే తొలిసారి కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది.